Tuesday, December 14, 2010

ఒక రామోజీ, ఒక రాధాక్రిష్ణ లాబీయింగ్ చేయకుండానే ఈ స్థాయికి వచ్చారా?

జర్నలిజం కాలేజీలలో సీటుకోసం దరఖాస్తు చేసుకునే అమ్మాయిలను...'తల్లీ...నీ రోల్ మోడల్ ఎవరు?' అని అడిగితే...తొభై శాతం మంది బర్ఖాదత్ పేరు చెబుతారు. అలాగే ఆమె పేరు చెప్పి..."ఇండియన్ జర్నలిజం స్కూల్"లో సీటు పొందిన ఒక ఉత్సాహవంతురాలైన విద్యార్థిని మాట్లాడుతూ..."సార్...మీరు అడిగినప్పుడు బర్ఖా దత్ పేరు చెప్పాను. ఈ టేపుల గొడవ చూశాక నా గుండె పగిలిపోయింది సార్...." అని అమాయకంగా చెప్పింది.
ఇప్పుడంతా బర్ఖా మీద పడి ఏడుస్తున్నారు కానీ...నాకు తెలిసి అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులు ఇలాంటి లాబీ వ్యవహారాలు చేస్తూ...తాము పనిచేసే సంస్థకో, తమకో లాభం కలిగేలా చూసుకుంటారు. గాస్ సిలిండర్ సైతం పైరవీతో కాకుండా...క్యూలో నిల్చుని తెచ్చుకోవాలని అనుకునే నాలాంటి వాళ్ళను ఇదే జర్నలిస్టులు....పిచ్చి నాయాళ్ళుగా, పనికిరాని వెధవలుగా చూస్తారు. లాబీ చేసుకోవడం మహాపాపం అనీ, అది ఇతరుల పొట్టకొట్టడం లాంటిదని, నిజంగా అర్హత ఉంటే మనల్ని విజయం వరిస్తుందని గట్టిగా నమ్మి ఈ మధ్య రెండు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ఒక అసిస్టంట్ లెక్చరర్ పోస్టు, ఒక రీడర్ పోస్టు చేజేతులా పోగొట్టుకున్నాను. అక్కడి లాబీ తతంగాలు చూస్తే...నిర్వేదం, నిస్తేజం కలిగాయి. 'నీ బొంద మీది నీతి! ఒక్క సారి వచ్చి మంత్రిని కలువు. లేకపోతే పనికాదు,' అని అంతకుముందే ఒక మిత్రుడు ఇచ్చిన సలహాను పాటించక తప్పుచేసానో, నీతిని నమ్ముకుని మంచి చేసానో నాకు ఇంకా బోధపడలేదు. డబ్బు, మందు, పొందు, పొగడ్తలు...వంటి మత్తుమందులు చల్లితేనే ఇక్కడ పనులవుతాయి. అది మీలో చాలా మందికి ఈ పాటికే అనుభవంలోకి వచ్చి వుంటుంది. కాకపోతే....కాస్త పాష్ సమాజంలో ఉండేవాళ్ళం కాబట్టి వీటిని బైటికి చెప్పుకోం మనం.

అంతదాకా ఎందుకు? మీకు అందుబాటులో వున్న 'ఈనాడు' లేదా 'ఆంధ్రజ్యోతి' విలేకరులతో మాట్లాడండి. వారితో వారి యాజమాన్యాలు ఎలా పనులు చేయిన్చుకున్నాయో చెబుతారు. అన్ని పత్రికలు నేతలను, పోలీసులను, అధికారులను అడ్డంపెట్టుకుని ప్రతి జిల్లా కేంద్రంలో ఛీప్ రేటుకు పెద్ద మొత్తంలో స్థలాలు కొన్నాయి. ఒక రామోజీ, ఒక రాధాక్రిష్ణ లాబీయింగ్ చేయకుండానే ఈ స్థాయికి వచ్చారా? ఆగస్టు సంక్షోభం ఒక పెద్ద మీడియా-పొలిటికల్ లాబీయింగ్ లో భాగం కాదా? పుష్కరాల కవరేజ్ కు కూడా మీడియా లాబీయింగ్ చేసిన ఘనత చంద్రబాబు గారిది. ఎన్.డీ.-టీ.వీ.యాజమాన్యానికి, ప్రనోయ్ రాయ్ కు తెలీకుండా ఇదంతా జరిగిందని అనుకోవడం ఒక పిచ్చితనం. ఇక్కడ దొరికినోడు మాత్రమే దొంగ సార్.

నాకు తెలిసి...ప్రతి విలేకరి తమ సంస్థ కోసం పైరవి చేస్తాడు. నేను....అలా చేసే వాడిని కాదు...అన్న పిచ్చి మారాజులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి వాడికి చెత్త బీట్ దొరుకుతుంది. పనికిరానివాడన్న ముద్ర బోనస్ గా లభిస్తుంది. విలేకరులు అంతా....వ్యాపార ప్రకటనల కోసం గడ్డి కరుస్తూ...లాబీ చక్రవలయంలో చిక్కుకుంటున్నారు. రాజకీయ తీట వున్న తాను ఇచ్చే ప్రకటన, ఫోటో పత్రికలో వేసి మర్నాడు...ఒక పచ్చ గాంధీ (ఐదొందలు) కోసం తన దగ్గరకు వచ్చే విలేకరుల గురించి ఒక న్యాయవాది చెబితే మొదట్లో నేను ఆశ్చర్యపోయాను. యాజమాన్యాలు సరిగా డబ్బులివ్వవు, మన లాయర్ లాంటి వాళ్ళు వ్యవస్థను కరప్ట్ చేస్తారు, ఈ కక్కుర్తిగాళ్ళు (విలేకరులు) గడ్డి తింటారు. ఇక్కడ మేత బాగుందని గ్రహించి...వేరే పనిచేసుకునే దొంగ వెధవలు కూడా విలేకరులు, విశ్లేషకులు, మేథావుల అవతారాలు ఎత్తి జర్నలిజాన్ని మరీ పలచన చేస్తారు.

నిజానికి జిల్లాల్లో విలేకరులు చాలా మంది ఏదో ఒక రాజకీయవేత్తకు బంటుగా పనిచేస్తారు. ఆ దన్నుతో అధికారులను బెదిరించి దండుకుంటారు. అయినా...పత్రికలు, ఛానెల్స్ పార్టీల వారీగా చీలిపోయినప్పుడు, ప్రకటనల కోసం విలేకరులకు టార్గెట్ లు ఉన్నప్పుడు....ఇంకా జర్నలిజంలో విలువలు ఉంటాయని అనుకోవడం ఒక భ్రమ, దురాశ. దురదృష్టవశాత్తూ మన దగ్గర జర్నలిస్టు యూనియన్ నేతలు కూడా మాంచి లాబీయిస్టులు. వారిని నమ్ముకోకపోతే....తర్వాత ప్రెస్ అకాడమీ ఛైర్మన్ వంటి పదవులకు లాబీయింగ్ కష్టమవుతుందని మన ఎడిటర్లు భావించాల్సిన పరిస్థితి. కాబట్టి....గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం దేనికి? కుళ్ళి కంపుకొడుతున్న వ్యవస్థను బాగుచేయడానికి దివి నుంచి భువికేగిన వ్యవస్థ...ఈ మీడియా అనుకోవడం దేనికి?
Add starShareShare with noteKeep unread

    'రాడియా గేటు' పై టీవీ చర్చల్లో లాబీయిస్టులకు పెద్దపీట

    వైష్ణవి కమ్యూనికేషన్స్ అధినేత్రి, కార్పోరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా...ప్రసిద్ధ జర్నలిస్టులు బర్ఖాదత్, వీర్ సంఘ్వి లతో తెరవెనుక నడిపిన మంత్రాంగం విషయంలో తెలుగు టెలివిజన్ చానెళ్ళు చేస్తున్న చర్చలు చూస్తే బాధ కలుగుతున్నది.

    తెలుగు జర్నలిజాన్ని బాహాటంగా అమ్ముకుని బాగా సంపాదించిన వారిని, యూనియన్ను అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా పదవులు, ఆస్తులు సంపాదించిన వారిని, జర్నలిజంలో నైతిక విలువలు పూర్తిగా నాశనం కావడానికి కారణమైన వారిని చర్చలకు పిలుస్తున్నారు. ఇది అభ్యంతరకరం, దారుణం, ప్రజలను మోసం చేయడం. పొట్టకోస్తే అక్షరం ముక్క బైటపడని ఈ పండితులు...టీ.వీ.స్టూడియోలలో కూర్చుని జర్నలిజం విలువల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నో చిలకపలుకులు పలుకుతున్నారు.

    అధికారంలో ఎవరుంటే...వారి భజన చేసి నాలుగు రాళ్ళు వెనుక వేసుకుని, తమ్ములకు అన్నలకు అత్తమామలకు మేళ్ళు చేసే ఈ బ్యాచు రాడియా ఉదంతం పై తీర్పులు చెబుతుంటే...అసహ్యం వేస్తోంది. ఈ బాపతు గాళ్ళు సచివాలయంలోపల, వెలుపల ఎలాంటి లాబీయింగ్ చేసి ఎంత సంపాదిస్తారో సీనియర్ జర్నలిస్టులను ఎవరిని అడిగినా చెబుతారు. సీనియర్ ఎడిటర్లు...దయచేసి చర్చలకైనా నికార్సైన నిజాయితీపరులైన జర్నలిస్టులను పిలిస్తే బాగుంటుంది.