Sunday, September 19, 2010

ఈ దొరయేందిరో !



తుది దశకు చేరుకున్న తెలంగాణ ఉద్యమాన్ని కులాల వారీగా చీల్చి తన అగ్రకుల దురహంకార మాయోపాయాన్ని తమపై ప్రయోగిస్తున్న టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ కుల రాజకీయంపై తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు కన్నెర్ర చేస్తున్నారు. కేసీఆర్‌ తెచ్చే వెలమ-రెడ్ల తెలంగాణ తమకు అవసరం లేదని, అగ్రవర్ణాలు లేని.. బడుగు బలహీన వర్గాలతో కూడిన సామాజిక తెలంగాణ మాత్రమే కావాలంటూ పిడిి లి బిగించనున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని టీఆస్‌ఎస్‌కు తాకట్టు పెట్టి, వారికి తొత్తులుగా మార్చుకునే కేసీఆర్‌ కుల రాజకీయాన్ని తిప్పికొట్టి, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో తామే ముందుండి తెలంగాణ సాధించుకోవాలని బడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు నిర్ణయించుకున్నారు.

మరోవైపు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కార్యాచరణ సిద్ధమయింది.అగ్రకులాల రాజకీయ ప్రయోగశాలగా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవడంతో పాటు, కేసీఆర్‌ పడగ నీడ నుంచి రక్షించాలన్న లక్ష్యంతో ఇకపై అడుగులు వేయాలని నిర్ణయించారు. శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ సభలో దళిత నేత విశారదన్‌ ప్రసంగాన్ని అక్కడే ఉన్న ప్రొఫెసర్‌ కోదండరామిరెడ్డి సూచనలతో అడ్డుకున్న వైనం బడుగు వర్గాల విద్యార్థి లోకంలో ఆగ్రహానికి దారితీసింది. ఈ పరిణామం.. కేసీఆర్‌ చేతిలో ఓయూ విద్యార్థి సంఘాలు చిక్కుకున్నాయన్న వాస్తవాన్ని గ్రహించిన బడుగు వర్గాలు, తమ ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకునేందుకు రంగంలోకి దిగాయి.

ఆత్మగౌరవ సభలో తమకు జరిగిన అన్యాయానికి కేసీఆరే కారణమంటూ శనివారం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థి నేతలు ఉస్మానియాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, కేసీఆర్‌ దిష్టిబొమ్మ దగ్థం చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఇది ఓయూలోని బడుగు వర్గాలకు విద్యార్థుల్లో కేసీఆర్‌ చేస్తున్న కుల రాజకీయాలపై ఉన్న ఆగ్రహానికి నిదర్శనంగా నిలిచింది. ఆయనపై తిరుగుబాటు చేసేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఆ మేరకు వారు శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

బడుగు బలహీన వర్గాల ఆత్మత్యాగాలతోనే తెలంగాణ ఉద్యమం చివరి అంకానికి చేరిందని, అయితే కేసీఆర్‌ దానిని వెలమ-రెడ్లకు అంకితం చేసేందుకు ఉద్యమంలో పాల్గొంటున్న తమ మధ్య చీలికలు తెచ్చి రాజకీయ ప్రయోజనాలు సాధించుకునే ఎత్తుగడను తిప్పికొట్టి కేసీఆర్‌ నుంచి తెలంగాణను రక్షించుకోవాలని బడుగు బలహీన వర్గాల విద్యార్థి జేఏసీ నేతలు నిర్ణయించుకున్నారు.కేసీఆర్‌ తన తొత్తులను తమలో చొప్పించి ఉద్యమాన్ని కులాల వారీగాచీలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిని అన్ని విధాలుగా ప్రలోభపరుచుకుని, తమ ఉద్యమాన్ని చివరకు టీఆర్‌ఎస్‌కు తాకట్టు పెట్టే దిశగా తీసుకువెళుతున్నందున, ఇకపై తాము కేసీఆర్‌ ఉచ్చులో చిక్కకూడదని బడుగు జేఏసీ నేతలు తీర్మానించు కున్నారు. తమ వర్గాలకే చెందిన కొందరు నేతలు ఇప్పటికే కేసీఆర్‌ ప్రలోభాలకు చిక్కినందున, అగ్రవర్ణాలతో పాటు వారిని కూడా దూరం పెట్టి బడుగు బలహీన వర్గాల విద్యార్థులతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు.

తమ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో తుది దశకు చేరిన ఉద్యమం ఫలించాలంటే తమకు అన్ని రాజకీయ పార్టీల అండ కావాలని, అందుకోసం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మద్దతు కోరాలని నిర్ణయించుకున్నారు.టీఆర్‌ఎస్‌ చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న కొన్ని విద్యార్థి సంఘాలు మిగిలిన రాజకీయ పార్టీలను అడ్డుకుని, మొత్తం విద్యార్థులను కేసీఆ ర్‌ మద్దతుదారులుగా మార్చే ప్రయత్నా లను తిప్పికొట్టాలని పిలుపునివ్వనున్నా రు. బడుగు బలహీన వర్గాల ద్వారా ప్రారంభమయిన ఉద్యమాన్ని హైజాక్‌ చేసి, దానిని ఒక్క శాతం కూడా లేని వెలమదొరలకు అంకితం చేసేందుకు కేసీఆర్‌ చేస్తున్న రాజకీయ కుట్రను సమర్థవంతంగా, సమిష్ఠిగా తిప్పికొడతా మని ఓయూ బీసి జేఏసీ కన్వీనర్‌ వి. రామారావు గౌడ్‌ స్పష్టం చేశారు.

విద్యార్థి ఉద్యమంలో చొరబడ్డ టీఆర్‌ఎస్‌ను దూరం చేయకపోతే మిగిలిన పార్టీలు దరికి చేరవని గుర్తించిన బడుగు వర్గాల విద్యార్థి సంఘాలు, మిగిలిన పార్టీల మద్దతు కోరేందుకు సిద్ధమవుతున్నాయి.నాయకులను అడ్డకుంటున్నది ఒక్క టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చే సంఘాలే తప్ప, విద్యార్థులంతా కాదని వారికి స్పష్టం చేయనున్నారు. కేసీఆర్‌ అగ్రకుల రాజకీయం, మీడియా వల్ల పెద్ద నేతలుగా ఎదిగిన తమ వర్గ నేతలు కొందరు కేసీఆర్‌ను తాము విమర్శిస్తుంటే అడ్డుకుంటూ, దొరలకు ఊడిగం చేస్తున్నందున.. అలాంటి వారిని ఇకపై నాయకులుగా గుర్తించ వద్దని పిలుపునిచ్చేందుకు తీర్మానించారు. ‘దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన మైక్రోఫైనాన్స్‌ కేసులో పెద్ద లీడరుగా చెలామణి అవుతున్న ఓ నేత 3 లక్షలు తీసుకున్నాడు. కేసీఆర్‌కు భజన చేయడం, ఆయన నుంచి లబ్థి పొందడమే వారి రోజు వారీ కార్యక్రమం. ఇది ఓయూలో అందరికీ తెలిసిన సత్యం. అలాంటి వాళ్లు చేసే ఉద్యమాలకు విశ్వసనీయత ఉంటుందా’ అని ఓ బీసీ విద్యార్థి సంఘ నేత ప్రశ్నించారు.

కొందరు నాయకుల తీరు, వ్యవహారశైలి వల్ల మొత్తం ఓయూ విద్యార్థులను దోషులుగా చూస్తున్నారని, అన్నింటికన్నా ప్రధానంగా విద్యార్థులందరినీ టీఆర్‌ఎస్‌ సానుభూతిపరులుగా, కార్యకర్తలుగా చూపించేందుకు కేసీఆర్‌, ఆయనకు తందానా పలుకుతున్న నేతల ప్రయత్నాలను అడ్డుకోవడం చారిత్రక అవసరంగా గుర్తిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో విద్యార్థులకు ఆత్మగౌరవం అనేది లేకుండా పోతుందని భావిస్తున్నారు.విద్యార్థి ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వారితో ఆరున్నర లక్షల సభ్యత్వాలు కేసీఆర్‌ చేయిస్తే, దానికి కారణమయిన విద్యార్థి నేతలు మాత్రం ఇంకా ఆయన చుట్టూ తిరుగుతున్న విషాద పరిస్థితిని తోటి విద్యార్థులకు వివరించేందుకు త్వరలో ఒక సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

కేసీఆర్‌ను దూరం పెట్టాలి
ramaraoతనకు తొత్తులుగా మారని విద్యార్థి సంఘాల నేతలపై కేసీఆర్‌ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఓయూ జేఏసీ కన్వీనర్‌ రామారావు ఆరోపించారు. కొన్ని విద్యార్థి సంఘాలు కేసీఆర్‌ ప్రలోభానికి లోనయ్యాయని, వారిని విద్యార్థులే దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. దళితుడికి సీఎం, మైనారిటీకి డిప్యూటీ సీఎం ఇస్తానన్న కేసీఆర్‌కు తెలంగాణ జనాభాలో 65 శాతం ఉన్న బీసీలు ఆ పదవులకు అర్హులుగా కనిపించలేదా అని ప్రశ్నించారు. అగ్రవర్ణ-దొరల తెలంగా ణకు వ్యతిరేకంగా జరిగే పునరేకీకరణ ఉద్యమంలో తామూ భాగస్వాము లవుతామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో మొదలయిన విద్యార్థి ఉద్యమాన్ని కేసీఆర్‌ చీల్చి, వారి మధ్య శత్రుత్వాన్ని రగిలించారని ఆరోపించారు. ఆరోపించారు.

కేసీఆర్‌ అగ్రకుల దురంహంకారి
Arvind-Kumar-Goudకేసీఆర్‌ అగ్రకుల దురహంకారి అని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అరవిందకుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. దళితుడితో చెప్పులు తొడిగించుకున్న కేసీఆర్‌ రేపు తెలంగాణ వస్తే దళితుల ఆత్మగౌరవాన్ని ఇంకెంత దెబ్బతీస్తారో గమనించాలని పిలుపునిచ్చారు. దళిత విద్యార్థి విశారదన్‌ను అవమానించిన టీఆర్‌ఎస్‌ అగ్రకుల వైఖరిని దళితులు, బీసీలు ఇప్పటికయినా గ్రహించాలని కోరారు. ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు మాత్రమే తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు ఇచ్చారన్న వాస్తవాన్ని విస్మరిం చకూడదన్నారు. చంద్రబాబునాయుడు దళితులకు లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్‌, బీసీలకు అసెంబ్లీ స్పీకర్‌, హోం, రెవిన్యూ, ఆర్ధికమంత్రి వంటి శక్తివంతమైన పదవులు ఇస్తే.. కేసీఆర్‌ మాత్రం దళితులతో చెప్పులు తొడిగించుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ దళితుడికి సీఎం పదవి ఇస్తానన్న కేసీఆర్‌.. నిజంగా దళితుడికి ఆ పదవి ఇస్తే అప్పుడు ఇంకెంత దారుణంగా అవమానిస్తారో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని గౌడ్‌ పిలుపునిచ్చారు.

కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా మారుతాం
visharadhan‘ఇప్పటికే ఓయూలో కొన్ని విద్యార్థి సంఘాలు టీఆర్‌ఎస్‌కు తొత్తుగా మారాయన్న అభిప్రాయం, అప్రతిష్ఠ జనంలో బలంగా నాటుకుపోయింది. అందువల్ల మిగిలిన పార్టీలు మాకు కంటితుడుపు మద్దతు తప్ప, మనస్ఫూర్తిగా మద్దతునిచ్చేందుకు ముందుకురావడం లేదని గ్రహించాం. ఈ పరిస్థితిలో కచ్చితంగా మార్పు తీసుకువస్తాం. విద్యార్థుల ఆత్మగౌరవంతో నడిపే ఉద్యమానికి అన్ని పార్టీల మద్దతు అవసరం. ఆత్మగౌరవమంటే శక్తి. ఆ శక్తిని నిర్వీర్యం చేయడమే కేసీఆర్‌ లక్ష్యం. మా ఉద్యమంలో చీలికలు తెచ్చిన కేసీఆర్‌ను మేం కూడా రాజకీయంగానే ఎదుర్కొంటాం. అంటే మేమే రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా మారతాం. అప్పుడే తెలంగాణ సిద్ధిస్తుంద’ని ఓయూకు చెందిన దళిత శక్తి రాష్ట్ర కన్వీనర్‌ విశారదన్‌ స్పష్టం చేశారు.

కేసీఆర్‌ బీసీల వ్యతిరేకి : జయప్రసాద్‌
కేసీఆర్‌ పచ్చి బీసీ వ్యతిరేకి అని, ఆయన ఉద్యమాన్ని నడిపించినంత కాలం తెలంగాణ రావడం అసాధ్యమని సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్‌ కె.జయప్రసాద్‌ స్పష్టం చేశారు. ఓయూలో దళిత విద్యార్థి నేత విశారదన్‌ను ప్రసంగం మధ్యలోనే అడ్డుకోవడం, దానిని కోదండరామిరెడ్డి దగ్గరుండి మరీ ప్రోత్సహించడం బట్టి.. దొరల తెలంగాణ కోసం కేసీఆర్‌ ఎంత నీచానికి పాల్పడుతున్నారో స్పష్టమవుతోందన్నారు. ఓయూ విద్యార్థులంతా తన చెప్పుచేతల్లో ఉండాలని కోరుకుంటున్నందున.. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కేసీఆర్‌ వలలో చిక్కుకోవద్దన్నారు. కేసీఆర్‌ కేవలం వెలమ-రెడ్ల కోసమే ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు.

No comments:

Post a Comment